దీపావళి పండుగ సందర్బంగా ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం కామారెడ్డి జిల్లా SP శ్రీ రాజేష్ చంద్ర IPS గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎల్లారెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మహేష్ గారి నేతృత్వంలో పేకాట ఆడుతున్న వారిపై అర్ధరాత్రి దాకా ప్రత్యేక దాడులు కొనసాగాయి. ఈ దాడులు లింగారెడ్డిపేట్, మల్కాపూర్, కళ్యాణి వెలుట్లపేట, మౌలాన్కేడ్ మరియు సాతేల్లి గ్రామాలలో ఒకేసారి నిర్వహించగా, జూదంలో నిమగ్నమైన 51 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి వద్ద నుండి రూ.27,780 నగదు, 26 మొబైల్ ఫోన్లు, 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దాడుల అనంతరం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో మొత్తం 6 కేసులు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ మహేష్ గారు వెల్లడించారు. పేకాట ఆడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల శాంతి భద్రత కోసం ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. స్థానిక ప్రజలు పోలీసులు చేసిన ఈ దాడులను అభినందిస్తూ, గ్రామాల్లో ఇటువంటి జూద కార్యకలాపాలను అరికట్టాలని కోరారు. పేకాట కారణంగా కుటుంబాలు, రైతులు, కార్మికులు ఆర్థికంగా దెబ్బతింటున్నారని, పోలీసుల చర్యలు సమాజానికి మేలుచేస్తాయని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి సందర్భంగా నిఘా మరింత బలోపేతం చేయబడిందని, ప్రజలు ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని, సమాచారమిస్తే వారి వివరాలు రహస్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.