కామారెడ్డి : రానున్న రెండు రోజులు భారీ వర్షాలు-జిల్లా కలెక్టర్
కామారెడ్డి జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి జిల్లాలో ధన, ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గురువారం సాయంత్రం అత్యవసరంగా అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రెండు రోజులు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున ఇటీవల జిల్లాలో సంభవించిన భారీ వర్షాల వలన కలిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాస్థాయి నుడి గ్రామస్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను అప్రమత్తం చేసి ధన, ప్రాణ నష్టం కలగకుండా చూడాలని అన్నారు. ఈమధ్య భారీ వర్షాల వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ అధికారుల సూచనలను పాటిస్తూ అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దు, చేపలు పట్టడానికి నీటివనరుల వద్దకు వెళ్ళవద్దు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలకు దూరంగా ఉండాలి, లో లెవెల్ బ్రిడ్జిలు, వంతెనల పై నుండి ప్రయాణాలు చేయరాదు, విద్యుత్ స్తంభాలను ముట్టుకోరాదు అని ప్రజలకు సూచించారు. ఈ టెలికంఫరెన్స్ లో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఆర్డీవోలు, ఇరిగేషన్ సిఇ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, విద్యుత్తు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ,సిపిఓ, డిఎల్పివోలు తదితరులు పాల్గొన్నారు.