

▪️ రాష్ట్రవ్యాప్తంగా ‘Arrive Alive’ అవగాహన కార్యక్రమాలకు ఘన ఆరంభం
▪️మాచాపూర్‌లో ర్యాలీతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం
▪️హెల్మెట్ చట్టం కాదు… ప్రాణాలను కాపాడే ఆయుధం
▪️గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణ రక్షణకు అవకాశాలు
▪️జనవరి 24 వరకు కొనసాగనున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
ఎల్లారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు ప్రారంభించిన (Arrive Alive) అవగాహన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈ నెల జనవరి 13 నుంచి 24 వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజున ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచాపూర్ గ్రామంలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలకు రోడ్డు భద్రతపై కీలక సందేశాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… Arrive Alive అనేది కేవలం ఒక నినాదం కాదు… ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలనే లక్ష్యంతో సాగాల్సిన ఒక ఉద్యమం, మనం సురక్షితంగా వెళ్తున్నా ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాలు సంభవించవచ్చు. అందుకే హెల్మెట్‌ను విధిగా ధరించాలి అని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన గంటలోపు (గోల్డెన్ అవర్) క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా 2012లో మాచాపూర్‌కు చెందిన అక్బర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటనను గుర్తు చేశారు. ఆ సంఘటనపై ఆయన కుమారుడు అప్రోజ్ భావోద్వేగంగా స్పందిస్తూ… మా కుటుంబంలో జరిగిన దుర్ఘటన మరెవరింట్లో జరగకూడదు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలి అని గ్రామ ప్రజలను వేడుకున్నారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాలు యాదృచ్ఛికాలు కాదని, అవి అతివేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ వినియోగం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి కారణాల వల్లే జరుగుతున్నాయని తెలిపారు. హెల్మెట్ చలానాల నుంచి తప్పించుకోవడానికి కాదు… అది మీ ప్రాణాలను కాపాడే ఆయుధం. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలి అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించగా, గ్రామ ప్రజలు పోలీస్ అధికారులకు ఘన స్వాగతం పలికారు. వీధి వీధి తిరుగుతూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బొజ్జ మహేష్, రెండవ ఎస్సై సుబ్రహ్మణ్య చారి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.